సోమవారం 8 ఆగస్టు 2011

చమత్కార (చాటు) పద్యాలు - 121

కం.
కవితాకన్యక గుణములు
కవికన్న రసజ్జుఁ డెఱుఁగుఁ గవి యే మెఱుఁగున్?
భువిలోఁ గన్యక గుణములు
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవి మిత్రులారా,
క్రింది సమస్యము పూరించండి.
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

22 వ్యాఖ్యలు:

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

ఎవడెవ్విధి తా మారునొ
ఎవనికి తల వ్రాత జూడ నెటు లుండునొ; యా
స్తవనీయ జగత్పిత మా
ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?

మందాకిని చెప్పారు...

భువనేశ్వరియౌ రమణిని
నవిరళమగుతన మనమున నాడెడి తలపుల్
శివుడను జగదీశు డుమా
ధవుఁ డెఱుఁగును గాక, కన్నతండ్రేమెఱుఁగున్?

చంద్రశేఖర్ చెప్పారు...

శాస్త్రిగారూ, పద్యం అదిరింది సార్, వేదాంతం దించేశారు.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

చంద్ర శేఖర్ గారూ! ధన్యవాదములు.

manatelugu చెప్పారు...

ఓ కన్నెపిల్ల స్వగతము:
రవికంచు పెరిగె రాత్రుల
సవడికిని నిదుర చెదరెను సవరిలు నాక
న్నెవయసు కలలు కుముదబాం
ధవుఁ డెఱుఁగును గాక; కన్నతండ్రేమెఱుఁగున్?

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

అవినీతి యుద్ధమందున
నవమన్మథ రూపు, నరుడి నందను జంపన్,
సవరించిన సైనము, సైం
ధవుడెరుగును గాక కన్న తండ్రేమెరుగున్.

మందాకిని చెప్పారు...

ధవుడెఱుంగును కాని తండ్రియు,త ల్లెఱుంగనె లేదు లె
మ్ము, వర పుత్రుని కన్నకుంతియు ముద్దుకర్ణునినీటి లో
న విడలేకను; బాధ, వేదననంత మింగుచు, యా విచా
ర వదనమ్మునుఁ జూప జాలక రాకుమారి భరించెనే!

అజ్ఞాత చెప్పారు...

రుక్మిణి:
అవనీసురా!జనుమయా!
వివరింపుముతరుణిగతిని వేదనలేకన్
లవలేశమైన నను మా
ధవుడెరుగును గాక! కన్న తండ్రేమెరుగున్?

L.V.RAJA RAO చెప్పారు...

భువనైక బుధ్ధి , భుజ బల
నివహాంగుడు - రామకార్య నిర్వహణా సం
భవ మారుతిని భువన బాం
ధవుడెరుగును గాక కన్న తండ్రే మెరుగున్?

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చంద్రశేఖర్ గారన్నట్లు వేదాంతపరమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మీ మొదటి పూరణ ఉత్తమంగా ఉంది. ఇక రెండవ పూరణగా సమస్యపాదాన్ని స్వల్పంగా మార్చి తరలవృత్తంగా వ్రాయడం ప్రశంసనీయం. అభినందనలు.
*
(మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పూరణ. ‘సవడి, సవరిలు’ శబ్దప్రయోగం అపూర్వం. అభినందనలు.
*
సైంధవుణ్ణి ఆశ్రయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సైనము’ ?
*
అజ్ఞాత గారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువు గారూ,

అది సైన్యము.......... ( టైపాటు ).

ధన్యవాదములు.

మందాకిని చెప్పారు...

గురువుగారూ, ధన్యవాదాలు.
తరల వృత్తాన్ని కూడా గుణదోషవిచారణ చేస్తారని ఆశించాను.

మందాకిని చెప్పారు...

వారాంతపు సమస్యలో కూడా నేనూ, రవిగారూ పూరణలు కొత్త చేసి యున్నాము. దయచేసి పరిశీలించగలరు.
మీ ఆరోగ్యం ఇపుడు మెఱుగ్గా ఉందని భావిస్తూ.....

మిస్సన్న చెప్పారు...

శివునిం గోరెద దీర్ఘా-
యువునని సుతుడన మృకండు డుద్విగ్నుండౌ,
నవు నాతని దీక్ష నుమా-
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

మిస్సన్న చెప్పారు...

ధృవు డయ్యెడ శ్రీహరికై
ప్రవిమల తప మాచరించి బడసెను కీర్తిన్
భువిఁ! బాలుని భక్తిని మా-
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

మిస్సన్న చెప్పారు...

' పవలున్ రేయియు సెల్లును
చెవినుంచును కూతు రేమి చెప్పు కొనెదరో! '
ఇవి నేటి తండ్రి మాటలు,
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

కంది శంకరయ్య చెప్పారు...

మిస్సన్న గారూ,
మీ మూడు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.

చంద్రశేఖర్ చెప్పారు...

ధన్యవాదాలు, మాస్టారూ.

మిస్సన్న చెప్పారు...

గురువుగారూ ధన్య వాదాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

శంకరార్యా ! ధన్యవాదములు.

మంద పీతాంబర్ చెప్పారు...

అవినీతి దొరల సంగతి
కవిపుంగవుడేల యెఱుగు? కాలుడు యెఱుగున్ ,
సవినయ ప్రహ్లాదుని మా
ధవుఁ డెఱుఁగును గాక కన్నతండ్రేమెఱుఁగున్?

కంది శంకరయ్య చెప్పారు...

మంద పీతాంబర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘కాలుడు + ఎఱుగున్’ అన్నప్పుడు యడాగమం రాదు కదా! ‘కాలుఁ డెఱుంగున్’ అంటే సరి!